KKR Vs PBKS Highlights: ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్

Kolkata Knight Riders vs Punjab Kings Full Highlights: పంజాబ్ కింగ్స్ టీ20ల్లో నయా రికార్డు సృష్టించింది. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా అవతరించింది. బెయిర్‌ స్టో (108) సెంచరీతో చెలరేగిన వేళ పంజాబ్ మరో 8 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 26, 2024, 11:56 PM IST
KKR Vs PBKS Highlights: ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్

Kolkata Knight Riders vs Punjab Kings Full Highlights: ఈ ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఆటతీరు ఊహతీతంగా మారింది. సంచలన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను ఊర్రూతలూగిస్తున్నారు. నేడు ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ జరిగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ విధించిన 262 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలిలి ఉండగానే ఛేదించి పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో చరిత్రలోనే కాకుండా టీ20 హిస్టరీలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ నిలిచింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను ఫినిష్ చేసింది. బెయిర్‌ స్టో (108) సెంచరీతో కదం తొక్కగా.. ప్రభుసిమ్రాన్ సింగ్ (54), శశాంక్ సింగ్ (68) హాఫ్ సెంచరీలు బాది జట్టును గెలిపించారు. ఇది పంజాబ్‌కు మూడో విజయం కాగా.. కేకేఆర్‌కు మూడో ఓటమి. 

Also Read: Hyderabad Weather Report: హైదరాబాద్‌ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు  

పంజాబ్ కళ్ల ముందు 262 పరుగుల లక్ష్యం. ఇంత టార్గెట్‌ను ఇప్పటివరకు ఛేదించిన జట్టే లేదు. రికార్డుల గురించి ఆలోచించకుండా దొరికిన బంతిని దొరికినట్లు బాదడమే లక్ష్యంగా బరిలోకి దిగారు పంజాబ్ బ్యాట్స్‌మెన్. ప్రభ్‌ సిమ్రన్ (20 బంతుల్లో 54, 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుతో ఇన్నింగ్స్‌ ఆరంభమైంది. బెయిర్‌స్టోతో కలిసి తొలి వికెట్‌కు 6 ఓవర్లలోనే 93 పరుగులు జోడించాడు. ప్రభ్ రనౌట్ అవ్వగా.. బెయిర్ స్టో అదే దూకుడు కంటిన్యూ చేశాడు. రిలీ రొసోవ్ (16 బంతుల్లో 26, ఒక ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి రెండో 85 రన్స్ జోడించాడు. రొసోవ్‌ ఔట్ అయిన తరువాత సుశాంక్ సింగ్ క్రీజ్‌లోకి రాకతో పంజాబ్ మరింత వేగంగా లక్ష్యంవైపు దూసుకెళ్లింది.

అగ్నికి వాయువు తోడైనట్లు అప్పటికే వేగంగా ఆడుతున్న బెయిర్‌స్టోకు తోడు శశాంక్ (28 బంతుల్లో 68 నాటౌట్, 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు. బెయిర్ స్టో (48 బంతుల్లో 108 నాటౌట్, 8 ఫోర్లు, 9 సిక్సర్లు) శతక్కొట్టాడు. వీరిద్దరి వీరబాదుడుతో పంజాబ్ మరో 8 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పంజాబ్ ఒక స్థానం మెరుగుపరుచుకుని..‌ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది.

అంతకుముందు సొంతగడ్డపై టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ఆరంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్.. ఎప్పటిలాగే టాప్ గేర్‌లో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు సాల్ట్ (37 బంతుల్లో 75, 6 ఫోర్లు, 6 సిక్సర్లు), నరైన్ (32 బంతుల్లో 71, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి వికెట్‌కు 10.2 ఓవర్లలోనే 138 పరుగులు జోడించారు. ఆ తరువాత వెంకటేశ్ అయ్యర్ (39), రస్సెల్ (24), శ్రేయాస్ అయ్యర్ (28) తలో చేయి వేయడంతో కేకేఆర్ 261 పరుగుల భారీ స్కోరు చేసింది.

Also Read: 7th Pay Commission: డీఏ పెంపుపై గందరగోళం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు ఎలా..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News