మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ఇబ్రహీం సొలీహ్

మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ఇబ్రహీం సొలీహ్

Last Updated : Sep 24, 2018, 12:57 PM IST
మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ఇబ్రహీం సొలీహ్

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఇబ్రహీం మహ్మద్ సొలీహ్ ఘన విజయం సాధించారు. భారతదేశం సోమవారం మాల్దీవులు అధ్యక్ష ఎన్నికలను స్వాగతిస్తూ..  విజయం సాధించిన ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నేత ఇబ్రహీం మహ్మద్ సొలీహ్‌ని అభినందించింది.

"మాల్దీవుల్లో జరిగిన మూడవ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రాథమిక సమాచారం మేరకు.. ఇబ్రహీం మహ్మద్ సొలీహ్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారని తెలిసింది. ఇబ్రహీం మహ్మద్ సొలీహ్‌ని మేము అభినందిస్తున్నాం. ఎన్నికల కమిషన్ అధికారికంగా ఈ ఫలితాన్ని ప్రకటిస్తుందని ఆశిస్తున్నాము" అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక పత్రిక ప్రకటనలో తెలిపింది. ఈ అధ్యక్ష ఎన్నికలు దక్షిణాసియా దేశంలో ప్రజాస్వామ్య శక్తుల విజయాన్ని సూచిస్తుందని, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. చైనాకు సరిహద్దు దేశమైన మాల్దీవులు భారత్‌తో గతకొంత కాలంగా సత్సంబంధాలు కొనసాగిస్తోంది.

మాల్దీవుల్లో గత కొంత కాలంగా రాజకీయ సంక్షోభం నెలకొని ఉంది. కొన్ని నెలల క్రితం మాల్దీవుల్లో ప్రజాస్వామ్య ఎన్నికల్లో గెలిచి తొలి అధ్యక్షుడైన మొహమ్మద్ నషీద్‌ సహా తొమ్మిది మంది ప్రతిపక్ష నేతల నేరాలను రద్దు చేస్తూ అక్కడి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిని వెంటనే రద్దు చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్‌ యామీన్‌ దేశంలో గత ఫిబ్రవరిలో 45 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధించారు.

నియంతగా ముద్రపడ్డ ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్‌ యామీన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసి ఆయన్ను గద్దె దించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 90 శాతం బ్యాలెట్ బాక్స్ ఓటింగ్‌ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఇబ్రహీం మహ్మద్‌కు అత్యధికంగా ఓట్లు పోలైనట్లు సోమవారం మాల్దీవుల ఎన్నికల సంఘం ప్రకటించింది. మాల్దీవుల్లో మొత్తం 263,000 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

విజయం అనంతరం ఇబ్రహీం మహ్మద్ సొలీహ్ మాట్లాడుతూ.. 'ఇది ప్రజలు అందించిన ప్రజాస్వామ్య విజయం.. తన గెలుపుకు కృషిచేసిన మాల్దీవులు ప్రజలకు ధన్యవాదాలు' అని అన్నారు.

 

Trending News