ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి దిగ్గజ క్రికెటర్లు..?

పాకిస్థాన్ ప్రధానిగా ఆగస్టు 11న పాకిస్థాన్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి భారత దిగ్గజ క్రికెటర్లను ఆహ్వానించారు.

Last Updated : Aug 2, 2018, 01:40 PM IST
ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి దిగ్గజ క్రికెటర్లు..?

పాకిస్థాన్ ప్రధానిగా ఆగస్టు 11న పాకిస్థాన్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి భారత దిగ్గజ క్రికెటర్లను ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రతినిధి ఫవాద్ చౌదరీ బుధవారం వెల్లడించారు. భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, నవజోత్ సింగ్‌లతో పాటు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నట్లు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ గతంలో క్రికెట్ ఆడే సమయంలో కపిల్, సునీల్ గవాస్కర్‌తో ఉన్న సానిహిత్యం కారణంగా వారిని పిలిచారనే ప్రచారం నడుస్తోంది.

జులై 25న పాక్‌‌లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజార్టీ లేకపోవడంతో చిన్న పార్టీలను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 11న తాను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  ప్రధాని మోదీతో సహా ఇతర దేశాల అధినేతలను ఆహ్వానించే అంశంపై తగిన సమాచారం ఇవ్వాలని, ఏఏ దేశాల నేతలను ఆహ్వానించడానికి అవకాశముందో తెలియజేయాలని ఇప్పటికే పీటీఐ పార్టీ నేతలు పాక్ విదేశాంగ శాఖను కోరారు. ఎన్నికల్లో పీటీఐ పార్టీ విజయం సాధించడంతో ప్రధాని మోదీ..ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇమ్రాన్ ఆహ్వానించడం గొప్ప గౌరవం: సిద్ధూ

పాకిస్థాన్ ప్రధానిగా మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం తనకు ఇచ్చిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అన్నారు. ఆహ్వానాన్ని తాను అంగీకరిస్తున్నానని చెప్పారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ఎంతో గొప్ప వ్యక్తిత్వమున్న వ్యక్తి అని...అతడిని విశ్వసించవచ్చునని ఆయన చెప్పారు.

 

Trending News