ఆ క్రికెట్ ఫ్యాన్‌ని దేశం విడిచివెళ్లమన్న కోహ్లీ.. టీమిండియా కెప్టెన్ పై మండిపడిన బీసీసీఐ

క్రికెట్ ఫ్యాన్స్‌తో ట్విట్టర్ ద్వారా ముచ్చటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకానొక సందర్భంలో తన సహనాన్ని కోల్పోయారు. 

Last Updated : Nov 9, 2018, 08:08 AM IST
ఆ క్రికెట్ ఫ్యాన్‌ని దేశం విడిచివెళ్లమన్న కోహ్లీ.. టీమిండియా కెప్టెన్ పై మండిపడిన బీసీసీఐ

క్రికెట్ ఫ్యాన్స్‌తో ట్విట్టర్ ద్వారా ముచ్చటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకానొక సందర్భంలో తన సహనాన్ని కోల్పోయారు. ఓ అభిమానికి ఘాటుగా జవాబిచ్చారు. "నాకు క్రికెట్‌కు సంబంధించి భారత బ్యాట్సమన్ కంటే  ఆస్ట్రేలియన్, ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ బాగా నచ్చుతారు. వారు ఆడే క్రికెట్‌ను నేను ఎక్కువగా ఇష్టపడతాను" అని ఓ భారతీయ అభిమాని ట్వీట్ చేయగా.. ఆయన ఆలోచనపై కోహ్లీ మండిపడ్డారు. "మీలాంటి వారు భారతదేశంలో ఉండాలని నేను అనుకోవడం లేదు. భారతదేశాన్ని వదిలి వేరే చోటికి వెళ్లండి. భారతదేశంలో ఉంటూ వేరే దేశాన్ని ఎలా ప్రేమిస్తారు? నన్ను ఇష్టపడకపోయినా మీరు ఫరవాలేదు. వేరే విషయాలపై మక్కువ పెంచుకొనే మీరు ఈ దేశంలో ఉండక్కర్లేదు. మీ ప్రాధాన్యతలు సరైన వాటికి ఇవ్వాలి" అని తెలిపారు. అయితే టీమిండియా వ్యాఖ్యలపై బీసీసీఐ మండిపడింది. ఒక క్రికెట్ ఫ్యాన్ ఆలోచన విధానం ఎలా ఉండాలో కోహ్లీ చెప్పక్కర్లేదని.. అలా చెప్పి క్రికెట్‌ని అవమానించవద్దని బీసీసీఐ బోర్డు ట్రెజరర్ అనిరుధ్ చౌదరి తెలియజేశారు. 

"బీసీసీఐ క్రికెట్ అభిమానులను ఎంతో గౌరవిస్తుంది. వారి ఆలోచనలనూ గౌరవిస్తుంది. వారి ప్రాధాన్యతలనూ గౌరవిస్తుంది. నేను సునీల్ గవాస్కర్ బ్యాటింగ్‌ను ఎంత ఇష్టపడతానో గార్డన్ గ్రీనిడ్జ్, దేశ్మండ్, వివియన్ రిచర్డ్స్ వంటివారి ఆటనూ అంతే ఇష్టపడతాను. నేను సచిన్ ఆటతో పాటు సెహ్వాగ్, గంగూలీ, లక్ష్మణ్, ద్రావిడ్ ఆడే ఆటతో పాటు కొన్ని సందర్భాల్లో మార్క్ వా, బ్రియాన్ లారా వంటి వారి బ్యాటింగ్ కూడా ఇష్టపడతాను. షేన్ వార్న్ నా అభిప్రాయంలో  గొప్ప స్పిన్నర్, కానీ కుంబ్లే బౌలింగ్ చూస్తే నన్ను నేనే మైమరిచిపోతాను. కపిల్ దేవ్ ఆటతో పాటు నాకు రిచర్డ్ హ్యాడ్లీ, ఇయాన్ బోతమ్, ఇమ్రాన్ ఖాన్ ఆట కూడా వ్యక్తిగతంగా ఇష్టమే" అని చౌదరి తెలిపారు.

క్రికెట్ అనేది ఒక క్రీడా నైపుణ్యానికి గౌరవాన్ని కలిగించినప్పుడే... ఈ క్రీడ కూడా గొప్ప గౌరవాన్ని పొందుతుందని... దయచేసి ఈ ఆటను ప్రాంతీయ, రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఉపయోగించవద్దని చౌదరి తెలిపారు. మరో బీసీసీఐ ప్రతినిధి కూడా ఇదే విషయంపై తన అభిప్రాయం తెలిపారు. "ఈ రోజు క్రికెట్ బతికుందంటే అందుకు కారణం అభిమానులే. వారే గనుక ఈ ఆట చూడకపోతే బీసీసీఐకి పైసా రాబడి కూడా ఉండదు. కోహ్లీ కూడా రూ.100 కోట్ల బ్రాండ్ అంబాసిడర్‌గా చెలామణీ అయ్యేవారు కాదు. బోర్డు ఆదాయం అంతా జనాలు క్రికెట్ చూడడం వల్లే వస్తోంది. కోహ్లీ గొప్ప ఆటగాడు. కానీ ఆయన గొప్ప మనిషిగా కూడా ఆలోచించాలి. క్రికెట్ అభిమానులను గౌరవించాలి" అని తెలిపారు.

Trending News