Dheera Movie: ధీర మూవీ రివ్యూ.. లక్ష్ వన్ మెన్ షో

Dheera Movie Review: లక్ష్ చదలవాడ హీరోగా.. సోనియా భన్సాల్, నేహా పఠాన్‌ హీరోయిన్స్‌గా నటించిన మూవీ ధీర. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 2) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది..? లక్ష్ మరో హిట్ కొట్టాడా..? రివ్యూపై ఓ లుక్కేయండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 05:28 PM IST
Dheera Movie: ధీర మూవీ రివ్యూ.. లక్ష్ వన్ మెన్ షో

Dheera Movie Review: వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు లక్ష్ చదలవాడ. తాజాగా ధీర మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మాస్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర బ్యానర్‌పై పద్మావతి చదలవాడ నిర్మించారు. లక్ష్ సరసన సోనియా భన్సాల్, నేహా పఠాన్‌లు హీరోయిన్లుగా నటించారు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందించగా.. సినిమాటోగ్రఫర్‌గా కన్నా పీసీ పనిచేశారు. మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి  తదితరులు కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్‌తో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ మూవీ ఎలా ఉంది..? ఆడియన్స్‌ను మెప్పించిందా..? రివ్యూలో చూద్దాం.. 

విశాఖపట్నంకు చెందిన రణ్‌ధీర్‌ (లక్ష్‌ చదలవాడ) డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. డబ్బు కోసం ఎంతటి సాహాసం అయినా చేస్తాడు. ఈ క్రమంలో రణ్‌ధీర్‌కు ఓ ఆసుపత్రి నుంచి కాల్ వస్తుంది. రాజ్‌గురు అనే పేషంట్‌ను వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్తే రూ.25 లక్షలు ఇస్తామని చెబుతారు. ధీర్‌ డ్రైవర్‌గా వెళ్లగా.. అంబులెన్స్‌లో డాక్టర్‌గా తన మాజీ ప్రేయసి అమృత (నేహా పఠాన్) వస్తుంది. మరో డాక్టర్‌గా మిర్చి కిరణ్‌ వస్తాడు. ఈ ముగ్గురు కలిసి లోపల ఉన్న పేషంట్‌ను దారిలో కొన్ని గ్యాంగులు చంపేందుకు ప్రయత్నించగా.. చాకచక్యంగా వారి నుంచి తప్పించి ఆ పేషంట్‌ను హాస్పిటల్లో చేరుస్తాడు ధీర్. తిరిగి వైజాగ్ వెళ్లే క్రమంలో తన వాహనంలో ఎక్కిన ఓ తల్లి బిడ్డ గురించి తెలుసుకుంటాడు. రణ్‌ధీర్‌ను కాపాడి ఆమె ప్రాణాలు వదులుతుంది. చివర్లో తన బిడ్డను కాపాడామని ఆమె ప్రాధేయపడుతుంది. ఇంతకు రాజ్‌గురు ఎవరు..? ఎందుకు అతడిని చంపేందుకు దాడులు జరిగాయి..? ఆ పాపకు రాజ్‌గురుకు ఉన్న సంబంధం ఏంటి..? ఆ పాప వెనుక గ్యాంగ్‌లు ఎందుకు పడుతున్నాయి..? రణ్‌ధీర్‌ను కాపాడిన ఆ మహిల ఎవరు..? ఆ పాపను రణ్‌ధీర్ ఎలా రక్షించాడు..? అనేది ధీర మూవీ.  

విశ్లేషణ..

పొలిటిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్న ఈ స్టోరీ ఊహించని ట్విస్టులు ఉన్నాయి. రెండు విభిన్న ప్రేమ కథలు, భారీ యాక్షన్ సీన్స్ ఇలా అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. పేపర్‌పై బలంగా కథను రాసుకున్న డైరెక్టర్.. అంతే బలంగా తెరకెక్కించడంతో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. హీరో ఎంట్రీ నుంచి చివరి వరకు చాలా సీన్స్ గత సినిమాలను గుర్తుకుతెస్తాయి. రాజ్‌గురు స్టోరీని మాత్రం ఆడియన్స్ కనిపెట్టకుండా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. 

కోమాలో ఉన్న రాజ్‌గురుని హైదరాబాద్‌కు తరలించేందుకు డాక్టర్లు ప్రయత్నించడం.. వీరికి రణ్‌ధీర్ సహకరించడం.. ఫోన్‌ ద్వారా హంసలేఖ (హిమజ) ఫోన్‌ ద్వారా డాక్టర్లకు సూచనలు ఇవ్వడం.. వంటి సీన్లతో కథ ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. హీరో లక్ష్‌ ఎంట్రీ అదిరిపోగా.. కారు రేసింగ్‌ సీన్‌తో క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో ముందే ఓ హింట్ ఇచ్చారు. మీనాక్షితో లవ్‌స్టోరీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.. లవ్‌స్టోరీలోని ట్విస్ట్‌తో కథపై మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తోపాటు రొమాంటిక్ సీన్స్, లవ్‌స్టోరీతో ప్రథమార్థం మొత్తం అలరిస్తుంది. ఇంటర్వెల్‌కు ముందుకు వచ్చే సీన్‌తో ద్వితీయార్థంపై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తుంది. 

సెకండాఫ్‌లో ఒక్క ట్విస్టు రివీల్ చేయడం ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది. పాప ఎవరు..? ఆమె కోసం వెతుకున్నది ఎవరు..? తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సీన్స్ సూపర్‌గా అనిపిస్తాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు అలరిస్తాయి. రాజకీయ కోణాలు కూడా సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తాయి.

ఎవరు ఎలా నటించారంటే..?
 
సరికొత్త కథలు, డిఫరెంట్ పాత్రలను ఎంపిక చేసుకుంటూ హీరో లక్ష్‌ చదలవాడ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీలో కూడా ధీర అనే డిఫరెంట్ రోల్‌లో మెరిశాడు. యాక్షన్ సీన్స్‌లో తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో చక్కగా యాక్ట్ చేశాడు. డాక్టర్ అమృతగా నేహా పఠాన్.. మనీషాగా సోనియా బన్సాల్ తమ పాత్రల పరిధిమేర బాగా నటించారు. మిర్చి కిరణ్ కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఇష్టపడేవాళ్లకు ధీర తప్పకుండా నచ్చుతుంది. 

రేటింగ్: 2.7
 

Trending News